విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్ సభ స్థానాలు జనసేన పార్టీకి ఖాయమైపోయాని, మిగిలిన లోక్ సభ స్థానాల్లో మన పార్టీ గట్టిపోటీ ఇస్తుందని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ శ్రీ మాదాసు గంగాధరం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు మొదలైందని, సార్వత్రిక ఎన్నికల్లో యువత, మహిళలు, వృద్ధులు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో అనూహ్య ఫలితాలు వెలువడనున్నాయన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన గాజువాక నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ఎన్నికల్లో కష్టపడిన జనసేన కార్యకర్తలకు జనసేన ముఖ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ “బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందాలని జనసేన పార్టీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. అందుకోసం నిద్రాహారాలు మాని ప్రజాసేవ చేస్తున్నారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది. రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్ వాది పార్టీకి 25 ఏళ్లు పడితే.. జనసేన మాత్రం ఐదేళ్లలో రాజ్యాధికారం చేపట్టబోతుంది. ఎన్నికల తర్వాత కూడా జనసేన నాయకులు ప్రజల మధ్య తిరుగుతుంటే అధికార, ప్రతిపక్షాలకు గుండెలు గుభేల్ అంటున్నాయి. ఫలితాల్లో ఎవరి కొంప మునుగుతుందో అని తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒక్క మాట అనడానికి భయపడుతున్న తరుణంలో హైదరాబాద్ నడిబొడ్డున సభ పెట్టి కేసీఆర్ ను నిలదీసిన ఒకే ఒక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల 20 మందికి పైగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. జనసేన పార్టీ మాత్రమే విద్యార్ధుల తరఫున ఆందోళన చేసి, వారి తల్లిదండ్రులకు అండగా నిలబడింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు విద్యార్ధులకు న్యాయం చేయాలని ప్రకటన విడుదల చేయగానే.. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రీవాల్యూషన్ చేస్తున్నట్లు ప్రకటించింద”న్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సలహాదారుడు శ్రీ పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ “జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు లభించిన వజ్రం. కోహినూర్ కంటే వేల రెట్లు ప్రకాశవంతమైన వజ్రం ఆయన. సమాజంలో మార్పు కోసం ఇంత పరితపిస్తున్న వ్యక్తిని నా 34 ఏళ్ల ఐఏఎస్ ఉద్యోగ జీవితంలో చూడలేదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారం చేశారు. శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరి మోసినట్లు .. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే జనసేన పార్టీని మోస్తున్నారు. ఆయన ఆస్తులను ఖర్చు చేసి పార్టీని నడుపుతున్నారు. ఆయనకు తగ్గట్టు జనసైనికులు, వీర మహిళలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో తన సొంత డబ్బు ఖర్చు చేసి పార్టీకి సేవ చేశారు.
ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా కనిపించదు. మొన్న జరిగిన ఎన్నికల్లో యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడంతో పాటు వారి తల్లిదండ్రులతో కూడా ఓట్లు వేయించారు. రాజకీయ అధికారం వల్లే రాజ్యాధికారం సాధ్యం. అందుకే పార్టీకోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం. గ్రామస్థాయిలో రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అన్నివర్గాల ప్రజలను కలుపుకొని రాజ్యాధికారం చేపడతాం. వార్డు మెంబర్లు, ఛైర్మన్, వైస్ చైర్మన్ ఇలా అన్ని పదవులు జనసైనికులు చేపట్టేలా కార్యచరణ రూపొందిస్తున్నామ”ని తెలిపారు.
విశాఖ లోక్ సభ అభ్యర్ధి శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “గాజువాక గడ్డ జనసేన అడ్డాగా మారిపోయిందని ప్రజలు మాట్లాడుతున్నారు. కేవలం 25 రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. మనం సూర్యుడు ఉదయించినప్పుడు ధైర్యంగా ప్రచారం చేస్తే .. మిగతా పార్టీలు అర్ధరాత్రి డబ్బు సంచులతో ప్రచారం చేశాయి. జనసేన పార్టీ తమ పార్టీ అని ప్రజలు నమ్మారు. అందుకు తగ్గట్టే మన మ్యానిఫెస్టో ప్రజల మధ్య తయారైంది. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లడంతో పాటు సమాజంలో మార్పు తీసుకొద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి. అందుకు ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాలి. వార్డుల్లో సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవ్వాలి. మన తరువాత లక్ష్యం జీవీఎంసీపై జనసేన జెండా ఎగిరేలా చేయాలి. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు జనసేన జెండా ఎగిరేలా మనం కృషి చేయాలి. గెలుస్తాననే గర్వం లేదు, ఓడిపోతానన్న భయం లేదు, మార్పు తెస్తానన్న నమ్మకం నాలో ఉంది అని జనసేనాని చెప్పిన మాటను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని జనసైనికులకు, వీర మహిళలకు పిలుపు”నిచ్చారు.
నరసాపురం లోక్ సభ అభ్యర్ధి శ్రీ కొణిదల నాగేంద్రబాబు మాట్లాడుతూ.. “నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు మార్పు తీసుకురావాలన్న కసితో పనిచేశారు. నరసాపురంలో తనతో పని చేసిన కార్యకర్తలు కనీసం భోజనం కూడా ఆశించలేదు. అందరిలో మార్పు తేవాలన్న బలమైన ఆకాంక్షే అందుకు కారణం. అందరి ఆలోచనలకి సరిపడిన నాయకుడి రూపంలో శ్రీ పవన్‌కళ్యాణ్ గారు దొరికారు. పవన్‌కళ్యాణ్‌తో పని చేస్తే తాము అనుకున్నది సాధించవచ్చన్న నమ్మకంతో అంతా కలసి పని చేయడానికి ముందుకు వచ్చారు. నాకు ఈ వ్యవస్థ సరిగా లేదన్న ఆలోచనే ముందుకు వచ్చేలా చేసింది. ప్రస్తుత వ్యవస్థలో ఏదీ సరిగాలేదు. రాజకీయం ఓ మాఫియాలా తయారైంది. ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఫిష్ మాఫియా. ఇలాంటి వ్యవస్థను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నాకు అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజా సేవలో తిరుగుతుంటే., ప్రత్యర్ధులు సిబిఐ కేసుల్లో బిజీగా ఉన్నారు. నరసాపురంలో నా మీద పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు మీద తాజాగా సిబిఐ దాడి జరిగింది. ఇలాంటి వారంతా ఎంపిలు అయితే ఏం చేస్తారు.? వ్యవస్థను అడ్డుపెట్టుకుని మరో వెయ్యి, రెండు వేల కోట్లు దోచుకుంటారు. విజయ్‌మాల్యా మాదిరి దేశం విడిచిపెట్టిపోతారు. అటు చూస్తే ప్రజల అవస్థలు వర్ణనాతీతం. పశ్చిమ గోదావరి జిల్లా పరిసరాల్లో తాగునీటితో సహా అంతా కాలుష్యమైపోయాయి. ప్రజలు వ్యాధుల భారినపడి విలవిల్లాడుతున్నారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే అందుకు కారణం అనిపించింది. గెలిచాక ఇలాంటి పరిస్థితుల మీద పోరాటం చేయాలనుకున్నా.ఇంత అవినీతికి పాల్పడిన టీడీపీ, వైసీపీ నాయకులు ధైర్యంగా రోడ్ల మీదికి వచ్చి మాట్లాడుతుంటే., నీతి, నిజాయితీతో ముందుకు వెళ్తున్న మనం ఇంకా ఎంత ధైర్యంగా మాట్లాడాలి. ఆ ధైర్యంతోనే పోరాటానికి దిగాం. కళ్యాణ్‌బాబు మాట్లాడితే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ ఉంటాడు. అలాంటి నాయకుడు వంద ఏళ్లు బతికితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి నాలాంటి వాళ్లు వేల మంది ఉన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ, వైసీపీ నాయకులు ఎన్ని సీట్లు వస్తాయనే అంశం మీద చర్చలు పెట్టే పనిలో, సర్వేలు వేసుకునే పనిలో ఉన్నారు. ప్రజల తీర్పు ఇప్పటికే ఈవీఎంలలోకి వెళ్లిపోయింది. దాన్ని ఎవరూ మార్చలేరన్న విషయం మాత్రం గ్రహించడం లేదు. కళ్యాణ్‌బాబు ఒక్కడే ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా పుస్తకాలు చదువుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుగారు సమీక్షల్లో బిజీగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి తో మంతనాలు చేస్తున్నారు. అసలు జేడీగారి మీద ట్వీట్ చేసే అర్హత విజయసాయి రెడ్డికి ఉందా ? అన్ని తప్పులు వారి దగ్గర పెట్టుకుని అలా ఎలా చేస్తారు. ఎలాంటి తప్పు చేయకుండా మంచిగా తన పని తాను చేసుకుంటూ పోతున్న కళ్యాణ్‌బాబు మీద ఆ మధ్య పనీపాట లేని కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఏం తెలంగాణలో 17 మంది విద్యార్ధులు చనిపోతే ఎవ్వరికీ నోరు లేవలేదు. అప్పుడు కూడా పవన్‌కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు, జనసైనికులు మాట్లాడారు, శంకర్‌గౌడ్ మాట్లాడారు. అదే జనసేన స్ఫూర్తి. విద్యార్ధులు చనిపోవడం వెనుక ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్ధత ఉన్నాయి. దాన్ని ప్రశ్నించడానికి ఈ సోకాల్డ్ నాయకులకు దమ్ములేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను ఎందుకు అడ్డుకున్నారని మాట్లాడే జగన్మోహన్రెడ్డి, విద్యార్ధుల సమస్య గురించి మాట్లాడరా.? ఆ దమ్ము ఎవరికీ లేదు. తెలంగాణలో కూడా పని చేసే దమ్ము జనసేనకు మాత్రమే ఉంది. మీలా కేసీఆర్ అంటే మాకు భయం లేదు. గౌరవం మాత్రమే ఉంది. ఇది టీజర్ మాత్రమే. మే 23 తర్వాత 2024 వరకు అసలు సినిమా ఉంటుంది. పీఆర్పీ సమయంలో విశాఖ ప్రాంతంలో తిరిగా ఇక్కడ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన కనిపించేది. నన్ను నరసాపురానికి ఎంపిక చేసిన తర్వాత ఇటు రావడం కుదరలేదు. కళ్యాణ్‌బాబుతో కలసి పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. 2014లో పార్టీ పెట్టినా, 2000 నుంచే నాయకుడిగా తయారయ్యారు. నేను చూసిన గొప్ప నాయకుల్లో కళ్యాణ్‌బాబు ఒకరు. దేశం గర్వించదగ్గ నాయకుడు. కళ్యాణ్బాబుకు స్వార్ధం లేదు. చిన్నపిల్లలను వదిలేసి, సర్వం త్యజించి ప్రజల కోసం వచ్చాడు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఓ ఆరు నెలలు దగ్గర నుంచి గమనించా, ఆయనలో ఏదో ఉంది అనిపించింది. ఏడాది తర్వాత ఏదో సాధించబోతున్నాడని అర్ధం అయ్యింది. తాను తినే ఆహారాన్ని తీసి పక్కవాడికి పెట్టే గుణం ఆయనది. ఎక్కువగా మాట్లాడడు, అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తాడు. చిన్నప్పటి నుంచి దారి తప్పిన ఈ వ్యవస్థను మార్చాలన్న తపన కళ్యాణ్బాబులో ఉండేది. ఆ తపన నుంచే జనసేన పుట్టింది. ఆయన బలం ఎలాంటిది అంటే గత నెల 19న బి.ఫారం ఇచ్చి నరసాపురం పంపారు. తాడేపల్లిగూడెం వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశించగానే నా కోసం వందల మంది అక్కడ ఉన్నారు. గంటన్నర ప్రయాణం నాలుగు గంటలు సాగింది. ప్రచారంలోనూ అదే పరిస్థితి. పది రూపాయలు ఆశించకుండా అంతా పని చేశారు. కార్యకర్తలు ఇచ్చే ఎనర్జీ అలాంటిది. జనసేనతో ఓ బలమైన మార్పు మాత్రం తీసుకువస్తాం. నా వంతుగా నేను నరసాపురంలో సెటిల్ అవడానికి నిర్ణయించుకున్నా” అని తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సెక్రటరీ శ్రీ పి. హరిప్రసాద్ మాట్లాడుతూ “ఇది ఆత్మీయ సభ కాదు విజయోత్సవ సభ. శాంతికాముకులైన విశాఖ వాసులు మంచి వ్యక్తినే ఎన్నుకుంటారని మొన్న జరిగిన పోలింగ్ సరళిని చూస్తే అనిపించింది. విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా పోటీచేసిన శ్రీ వి. వి. లక్ష్మీ నారాయణ కూడా అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనే నమ్మకం ప్రతి జనసైనికుడిలో ఉంది. గాజువాక నియోజకవర్గంలో 49 మందితో సెంట్రల్ కమిటీ, 75 మందితో కోఆర్డినేషన్ కమిటీలు వేసి ప్రచారం చేశాం. ఎవరికి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో వ్యక్తిగా భావించి ప్రచారం చేశారు. వాళ్ల పని తీరును చూశాక ఇక్కడ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే నమ్మకం కలిగింది. గాజువాక నియోజకవర్గంలో భిన్న వ్యక్తులు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నివసిస్తున్న ప్రాంతం. మినీ ఇండియాలాంటి ఈ ప్రాంతాన్ని కాలుష్యం, మంచినీరు, రోడ్ల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలంటే సాధారణ రాజకీయ నాయకుడి వల్ల కాదు. నిస్వార్ధపరుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది అన్నారు.
ఈ సమావేశానికి జనసేన పార్టీ నేత శ్రీ టి.శివ శంకర్ అధ్యక్షత వహించారు. పార్టీ ముఖ్యులు శ్రీ పి.వి. రావు, శ్రీ ఎ.వి. రత్నం, శ్రీ వై. నగేష్ , శ్రీ బొలిశెట్టి సత్య, విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు- అనారోగ్య సమస్యతో మరణించిన జనసేన నంద్యాల లోక్ సభ అభ్యర్ధి శ్రీ ఎస్.పి.వై. రెడ్డి గారికి నివాళులు అర్పించారు.