జనసేన కోసం క‌ష్టప‌డినవారికి స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అవ‌కాశం

రెండు కుటుంబాల మ‌ధ్య న‌లిగిపోతున్న రాష్ట్ర రాజ‌కీయాల‌ను సామాన్యుడి చెంత‌కు చేర్చాల‌నే ల‌క్ష్యంతో జ‌న‌సేన పార్టీని శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు స్థాపించార‌ని పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మ‌న్ శ్రీ మాదాసు గంగాధరం స్ప‌ష్టం చేశారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాజ్యాధికారం ద‌క్కాల‌ని ఆయ‌న ప‌డ్డ క‌ష్టానికి రాష్ట్రంలో మార్పు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని అన్నారు.

మంగ‌ళ‌వారం భీమ‌వ‌రంలోని నిర్మలాదేవి ఫంక్ష‌న్ హాల్ లో న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. జనసేన ముఖ్యనేతలు హాజ‌రై  పోలింగ్ సంద‌ర్భంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ.. “స‌ర్వేల్లో ఆ పార్టీ విజ‌యం సాధిస్తుంది.. ఈ పార్టీ విజ‌యం సాధిస్తుంది అని చెబుతున్నారు. మాకు స‌ర్వేల‌తో ప‌నిలేదు. జ‌న‌సేన పార్టీయే ప్ర‌భుత్వాన్ని స్థాపించ‌బోతుంది. భ‌విష్య‌త్తు కూడా జ‌న‌సేన పార్టీదే.  నిజాయ‌తీ, నిబ‌ద్ధ‌త గ‌ల నాయ‌కుడిని భ‌గ‌వంతుడు కూడా ఆశీర్వ‌దిస్తాడు. అతి త‌ర్వ‌లో రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారిని చూడ‌బోతున్నాం.  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఆప‌ధర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి గానీ, ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గానీ భ‌యం. జ‌న‌సేన అధినేత‌కు అలాంటి భ‌యాలు లేవు. అందుకే హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆంధ్ర రాజ‌కీయాల్లో దొడ్డిదారిన వేలుపెట్టొదు, కావాలంటే డైరెక్టుగా అభ్య‌ర్ధుల‌ను నిల‌బెట్టి పోటీ చేయాల‌ని స‌వాల్ చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకు ప్ర‌తి జ‌న‌ సైనికుడు కృషి చేయాల‌”ని కోరారు.

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి  రాజకీయ సలహాదారుడు శ్రీ పి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ “అధికారం చేజిక్కించుకోవ‌డానికి జ‌న‌సేన పార్టీ ఎంతో దూరంలో లేదు. అతి త‌ర్వ‌లో అధికారం చేప‌ట్ట‌నుంది. మొన్న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యువ‌కులు, మ‌హిళ‌లు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి పార్టీ కోసం ప‌ని చేశారు. సొంత డ‌బ్బులు, పార్టీ కోసం వెచ్చించారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అవ‌కాశం క‌ల్పిస్తాం. గ్రామ‌ స్థాయిలో రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లను క‌లుపుకొని రాజ్యాధికారం చేప‌డ‌తాం. అన్ని ప‌ద‌వులు జ‌న‌సైనికులు చేప‌ట్టేలా కార్య‌చ‌ర‌ణ త‌యారు చేశాం. దీని కోసం ప్ర‌తి గ్రామంలో వార్డు క‌మిటీలు వేస్తాం. ప‌ద‌వి లేక‌పోతే పోరాటం చేయ‌లేం, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిచంలేం. అందుకే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలిచే విధంగా జ‌న‌సైనికులు కృషి చేయాలి. మొన్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ బ్యాలెట్ ద్వారా రిలీజ్ చేసిన బులెట్లు ఎవ‌రి కొంప ముంచుతుందోన‌ని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి.  కోట్లు ఖ‌ర్చు చేసి స‌ర్వేలు చేసుకున్న‌వాళ్లు కూడా గెలుపు త‌మ‌దేన‌ని చెప్ప‌లేక‌పోతున్నారు. మిగిలిన రెండు పార్టీలు కోట్లు ఖ‌ర్చు చేస్తే.. ఓట్లు మాత్రం గాజుగ్లాసు గుర్తుకు ప‌డ్డాయి. ఎన్నిక‌ల్లో ఇది వ‌ర‌కు పెద్ద‌లు పిల్ల‌ల‌ను మార్చేవారు.. కానీ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం  యువ‌కులు చెప్పిన పార్టీకి పెద్ద‌లు ఓట్లు వేశార‌”ని అన్నారు.

న‌ర‌సాపురం లోక్ స‌భ అభ్య‌ర్ధి శ్రీ కొణిద‌ల నాగేంద్ర‌బాబు మాట్లాడుతూ “ప‌ద‌వి అంటే హోదా కాదు బాధ్య‌త. ప్ర‌తి ఒక్క‌రికి సేవ‌కుడిలా ప‌ని చేయాలి.  కులాలు, మ‌తాల‌ను ప‌క్క‌న పెట్టి బాధ్య‌త గ‌ల ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నే మ‌న‌స్తత్వం అంద‌రిలో పెర‌గాలి. శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారిలా గొప్ప విజ‌న్ ఉన్న నాయ‌కులు చాలా అరుదుగా ఉంటారు. ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌కీయాల్లో చాలా మార్పు వ‌చ్చింది. భ‌విష్య‌త్తులో కూడా మంచి మంచి మార్పులు మ‌నం చూడ‌బోతున్నాం. మా త‌మ్ముడు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడ‌ని తెలియ‌గానే టెన్ష‌న్ ఫీల‌య్యాను. ప్ర‌చారం కూడా స‌రిగా చేయ‌లేక‌పోయాను. ఇలాంటి సంఘ‌ట‌న‌లు తెలుగుదేశం, వైసీపీ పార్టీ లీడ‌ర్ల‌కు జ‌రిగితే  గొప్ప ప్ర‌చార అస్త్రంగా వాడుకునే వారు. జ‌న‌సేన మాత్రం అలా చేయ‌లేదు. పెద్ద మార్పు తీసుకొచ్చేట‌ప్పుడు న‌మ్మ‌కం ఉండాలి. త‌ప్పు చేస్తే ఎదురించే ధైర్యం ఉండాల‌”న్నారు. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి పొలిటిక‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ పి. హ‌రిప్ర‌సాద్ మాట్లాడుతూ “గౌత‌మ‌బుద్దుడు అహింస‌తో, వివేకానందుడు విజ్ఞానంతో చెడును పారదోలితే ..  అవినీతితో నిండిపోయిన రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు జ‌న‌సేన పార్టీ స్థాపించారు.  శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి సంక‌ల్ప‌దీక్ష‌తో ఏర్పాటైన జ‌న‌సేన పార్టీ.. మంచి వాళ్ల‌కు అండ‌గా, చెడ్డ‌వారికి సింహ‌స్వ‌ప్నంగా ఉంటుంది.  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధులు, జ‌న‌సైనికుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నాం.  ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, కాకినాడ‌లో ప‌ర్య‌టించి అభ్య‌ర్ధులు, కార్య‌క‌ర్త‌ల అనుభ‌వాలు తెలుసుకున్నాం. వెళ్లిన ప్ర‌తిచోట శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారిని ముఖ్య‌మంత్రిగా చూడ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని జ‌న‌ సైనికులు చెబుతున్నారు.  ఆ ల‌క్ష్యం నెర‌వేరాలంటే మ‌రో రెండు, మూడు నెల‌ల్లో రానున్న‌ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అవ‌కాశంగా మ‌లుచుకోవాలి. గ్రామాల్లో పార్టీని బ‌లోపేతం చేసి రాష్ట్రంలో జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడేలా చేయాలి. ఏడు బ‌ల‌మైన సిద్ధాంతాల‌ను పునాదులుగా చేసుకుని జ‌న‌సేన పార్టీని శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు నిర్మించారు. పార్టీకి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంది. రాష్ట్రంలో ఎప్ప‌టికైన మిగిలే ఏకైక పార్టీ జ‌న‌సేన పార్టీయే. మిగతా పార్టీల‌తో ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌ని ఉండ‌దు” అని చెప్పారు. ఈ స‌మావేశంలో పార్టీ ముఖ్యులు శ్రీ ఎ.వి.ర‌త్నం, శ్రీ బొమ్మదేవర శ్రీధర్, శ్రీ వై. న‌గేష్ , శ్రీ  బ‌న్ని వాసు పాల్గొన్నారు. స‌మావేశం అనంత‌రం న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి రివ్యూ నిర్వ‌హించారు. జ‌న‌సేన అభ్య‌ర్ధి, ఆ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ముఖ్యులు హాజ‌ర‌య్యారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి విడివిడిగా రివ్యూ నిర్వ‌హించారు.