ఎస్‌ఈసీని తొలగించడానికి ఇదాసమయం?:పవన్‌

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. కక్ష సాధింపు, మొండివైఖరి, ఏకపక్ష నిర్ణయాలతో జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. తాజాగా ఎస్‌ఈసీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని జగన్‌ నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమైన విషయాల్లో సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగానే ఉంటున్నాయని ఆక్షేపించారు. హైకోర్టుతో చీవాట్లు పెట్టించుకున్నా.. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’’ అన్న సామెతలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

కక్ష తీర్చుకోవడంలో మునిగిపోయారు

‘‘ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి ఇదా సమయం? ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను ప్రజలను కాపాడటంపై కేంద్రీకరించారు. ఇందుకు భిన్నంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలా కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోయారు. కరోనా పడగ విప్పుతున్న సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ఎంతటి ప్రమాదంలో పడి ఉండేవో ఊహించగలమా?’’ అని పవన్‌ నిలదీశారు.

మేం స్వీయ నియంత్రణ పాటిస్తున్నాం.. కానీ..

‘‘దేశం ఆపత్కాలంలో ఉన్న ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోంది. మీరు తీసుకున్న ఇలాంటి కక్ష సాధింపు నిర్ణయాల కారణంగా ఆ నియంత్రణను దాటి మీ చర్యను ఖండించాల్సిన పరిస్థితిని మీరే సృష్టించారు. జనసేన కోరుకుంటున్నది  ఒక్కటే.. ఇది ప్రజల ప్రాణాలను కాపాడే సమయం.. మీ కార్యాచరణ ఆ దిశగా ఉండాలి’’ అని పవన్‌ హితవు పలికారు.