సామాజిక, సాహితీ సేవల్లో నేటి తరానికీ స్ఫూర్తిగా నిలిచే మహనీయుడు స్వర్గీయ కందుకూరి వీరేశలింగం గారు. సంఘ సంస్కరణలకు నాటి ఛాందసవాదుల నుంచి ప్రతిఘటనలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలిచిన ధీశాలి. నేడు వీరేశలింగం గారి జయంతిని పురస్కరించుకొని వారి విశిష్టతను స్మరించుకోవాలి.

స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చి వారిలో జ్ఞానజ్యోతులు వెలిగించడమే కాకుండా బాల్య వివాహాలను అడ్డుకొని… వితంతు పునర్వివాహాలు చేసి… కుల నిర్మూలనకు నడుం బిగించిన గొప్ప సంఘసంస్కర్త. ఈ సంస్కరణోద్యమంతోపాటు తెలుగు భాషకు వీరేశలింగం గారు చేసిన సేవలు అగణనీయమైనవి. మాతృ భాష మాధుర్యాన్ని తదుపరి తరాలకు అందించేందుకు ఎంతో కృషి చేశారు. వాడుక భాషలోనే రచనలు చేయడం అందులో ముఖ్యమైనది. తెలుగులో తొలి నవల, తొలి ప్రహసనం, తొలి స్వీయ చరిత్రలను రచించిన ఘనత వీరేశలింగం గారిదే.
కందుకూరి వీరేశలింగం గారు సమాజ హితం కోరుతూ హితకారిణి సమాజం స్థాపించారు. తన యావదాస్తిని సమాజానికే ఇచ్చారు. వారు ఇచ్చిన ఆస్తులను కాపాడుకోవడంతోపాటు… సమాజానికి ఇచ్చిన విలువలనూ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. తెలుగు భాష కోసం చేసిన సేవలను మరువకూడదు. ఇప్పుడు మన మాతృ భాషను విద్యా సంస్థల నుంచి దూరం చేసే ప్రయత్నాలను పాలకులు మొదలుపెట్టారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాతృ భాషకు ఊపిరులూదేలా తీర్పు ఇచ్చి భాషాభిమానులకు ఊరటనిచ్చింది. ఈ తరుణంలో మనందరం వీరేశలింగం గారు ఇచ్చిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని భాషకు అన్యాయం చేసేవారిని అడ్డుకొందాం. ఆ నవయుగ వైతాళికుడు నడయాడిన గోదావరి తీరంలోనే ‘మన నుడి – మన నది’కి శ్రీకారం చుట్టాం. ఆ సంస్కర్త అందించిన స్ఫూర్తితోనే మన నుడి మన నదిని ముందుకు తీసుకువెళ్తాం అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.